Wednesday, November 11, 2015

స్వార్దం ఎప్పుడుండాలి


 మనిషికి స్వార్ధం ఉండాలి
 ఆ స్వార్ధం ఎప్పుడుఉపయోగపడాలో తెలుసా.?
ఇది నా దేశం
 ఇది నా ధర్మం
 అని ఇలాంటి సమయంలో
 నా అనే స్వార్ధం ఉండాలి
 ఎదుటివారు మన ధర్మాన్ని కించ పరుస్తున్నా
 చూసి ఏమీ అనని వాడు
 బ్రతికి ఉన్న చచ్చిన శవమే.!
ఇలా ఎంతోమంది చచ్చిన శవాలున్నారు
 ఈ దేశంలో
 స్వామీ వివేకనంద ఇచ్చిన స్పూర్తి చచ్చిపోయింది
 జనాలలో
 లేండి
 మేల్కోనండి
 గమ్యం చేరేవరకు
 విశ్రమించకండి
 అని ఆయన చెప్పిన మాటలు
 ఎవరి చెవులుకు తాకడం లేదు
 మనమంతా స్వార్దపూరితంగా
 నా అనే అహంకారంతో
 మన ధర్మాన్ని, ఈ దేశాన్ని
 ఇలా ఐనా కాపాడుకుందాం.!

ఆత్మజ్ఞానం

ఆత్మను గురించి ఏం ఆలోచించగలం? ఏం చెప్పగలం? ఆలోచన మనస్సు పరిధిలోది. 'ఆత్మ' మనస్సు దాటిన తర్వాత కలిగే అనుభూతి. ఆత్మ ఉండీ లేనట్లు, లేకపోయినా ఉన్నట్లు అనిపిస్తుంది. అనుభూతికి మాత్రం అందుతుంది. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేవి మూడూ ఒక్కటే. రూపగుణాలు ఒక్కటే. అవధులు మాత్రం వేర్వేరు. ఒక్కటే అయిన ఆత్మ అవసరానికి 'అంతరాత్మ' అనిపిస్తుంది. పైకి వెళ్లాక 'పరమాత్మ'గా వ్యవహరిస్తుంది. ఆ రహస్యం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. అసలు ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మను గురించి మరింతగా తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఇక్కడ తెలుసుకునేది మనస్సుతో కాదు. అత్మతో - అది ప్రజ్ఞా విశేషం.
అయితే 'ఆత్మ' వివేకం ముందు కలగాలి. వివేకానికి జిజ్ఞాస జతపడాలి. అప్పుడు ప్రజ్ఞ బయటకొచ్చి ఆత్మజ్ఞానానికి తుదిమెరుగులు దిద్దుతుంది. 'ఆత్మ'ను గురించిన కనీస అవగాహన ఏర్పడితే అటువైపు దృష్టి సారించవచ్చు. మామూలు దృష్టికి ఆత్మ కనిపించదు, అందుకు అంతర్దృష్టి ఏర్పడాలి. మనస్సును నిద్రపుచ్చి లేదా శూన్యంచేసి ఆలోచనలు తలఎత్తకుండా చేసినప్పుడు ఆత్మ అనుభూతికి అందుతుంది. నిజానికి ఆత్మసహకారం లేనిది 'ఆత్మజ్ఞానం' కలగదు.

ఆత్మ రక్షణ, పోషణకు పరమాత్మ చింతనే మార్గం

జీవితంలో సుఖభోగాలు అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. సాధారణంగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. మానవ జీవితం కష్టసుఖాల సంగమం. ఆపదల్లో ఉన్నప్పుడు కూడ ఈశ్వర చింతన కలిగి ఉండనివారున్నారీ లోకంలో. అట్టివారు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి వారిని నాస్తికులనడమే సమంజసం. వీరు ఎంత కష్టమొచ్చినా ఒక్క క్షణమైనా భగవన్నామోచ్ఛరణ చేయరు. ‘‘జాతస్య మరణం ధృవమ్’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతి జీవిని మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. అంచేత మొండికట్టెల్లా కాలాన్ని వ్యర్థంగా గడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఉత్కృష్టమైన మాన
వజన్మ ఎత్తికూడ అనివార్యమైన భగవత్ప్రేమకు పాత్రులు కాకపోవడం చింతించవలసిన విషయం. అభ్యాసం ఉంటే తప్ప ఎవరికి పరమాత్మ చింతన అలవడదు. ఉన్నతమైన మానవజన్మనెత్తి బుద్ధి జ్ఞానం కలిగి ఉన్న మనిషి కాలాన్ని వ్యర్థంచేసే బదులు ఏ క్రిమికీటకంగానో పుట్టి ఉంటే ఈ మానుషజన్మకు కళంకం ఉండదు కదా!
సర్వకాల సర్వావస్థలయందు సంసార సుఖభోగాల్లో పడినవారికి ఎంత ఆయుష్షుంటే ఏం లాభం? తనకు తెలీకుండానే అది హారతికర్పూరంలా కరిగిపోతుంది. కాలం వృధాగా పోతోందని గ్రహించిన వాడికి క్షణకాలమైనా చాలు మోక్షంకోసం ప్రయత్నించి సిద్ధిపొందొచ్చు. మనం చేసే మంచి పనుల్లోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి పది మందికి పనికొచ్చే సత్కార్యాల్ని చేయాలి. ఈశ్వరోపాసనకి పూజ, ప్రార్థన ముఖ్య సాధనాలు. మన స్థూల శరీరానికి కర చరణాదులు ఎలాగో అలాగే ఆత్మకు జ్ఞానాదులు అలాంటివని తెలుసుకోవాలి. లోకంలో జనులు దేహం మీదున్న అభిమానం చేత సర్వసుఖాల్ని పొందడంకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖంకోసం గాని, సంసార బంధ విముక్తులవడానికి గాని యత్నించరు. అందువల్లే ఉత్కృష్టమైన ఈ మానవజన్మ వ్యర్థవౌతోంది. ఆత్మను పోషించుటకు, రక్షించుటకు పరమాత్మ చింతనే ముఖ్యసాధనం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాగే భగవంతుణ్ణి తలంచని వాడికి ఆ దేవుడు కరుణించడు. ముక్తినివ్వడు. పండితులు, భాగవతులు తమ గానం చేత, నృత్యం చేత, పూజాది సత్కర్మలచేత జపతపముల చేత భగవంతుణ్ణి అనేక రకాలుగా స్తుతిస్తారు. మరి పామరుల సంగతేంటి? రాజదర్శనం కావాలంటే ముందుగా భటుని దర్శించవలసి ఉంటుంది. తోటలోని ఫలాలు కావాలనుకుంటే ముందుగా తోటమాలిని ఆశ్రయించాలి. అలాగే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు భాగవతుల్ని ఆశ్రయించాలి. అది సాధ్యంకానప్పుడు సత్పురుష సాంగత్యమైనా చెయ్యాలి. అది కూడ దుర్లభం అనుకుంటే తన దుష్టప్రవర్తనను తానే సరిదిద్దుకోగలగాలి. అందుకు శుభాశుభములు తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. వివేకం కలగాలంటే ముందు తను నీతిగా ఉండాలి. అందుకు విద్య అవసరం. విద్య అంటే ఆ సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవడమే. తప్ప పొట్టకూటికోసం విద్యలుకావని గ్రహించాలి. ఈశ్వర చింతన యందు అభిలాష ఉంటే విజ్ఞానవంతులవుతారు. దాంతో సంసార భోగవాంఛలు వాటంతటవే నశిస్తాయి. మనమంతా పుణ్యంకోసం గంగానది స్నానాలు, గుళ్ళు గోపురాల దర్శనం చేస్తుంటాం. ఇవన్నీ బాహ్యేంద్రియ శుద్ధి చేసేవే గాని ఆత్మశుద్ధికి తోడ్పడవు. వాటన్నిటికంటె ముందు శుభకర్మల్ని ఆచరించాలి. పరోపకారం, సత్యం పలకడం, భూత దయ, సత్‌సాంగత్య విద్య దానాదిక ధర్మాలు, మాతృపితసేవ, బ్రహ్మచర్యం, ఈశ్వర స్తుతి మున్నగు ఉత్తమగుణాలే శుభకర్మలు అనబడతాయి. శ్రీహరిని పూజించనివారు జీవచ్ఛవంబులనే చెప్పాలి. అందుకే అంటారు పరమాత్మ చింతన లేని జన్మవ్యర్థం అని.

ధర్మ సందేహం: ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?

ధర్మ సందేహం: ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?
నిద్రపోతున్నపుడు మన ఆత్మ పరమాత్మతో కలుస్తుందని మన వేదాంత శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కానీ, నిజంగానే ఈ రెండు ఒక్కటిగా కలుస్తాయా అనే ధర్మ సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. నిజంగానే ఈ రెండు కలుస్తాయట. ఇదెలాగంటారా... అయితే ఈ కథనం చదవండి.
సాధారణంగా మన శరీరాల్లో ఐదు కోశాలుంటాయని వేదాంత శాస్త్రం చెపుతోంది. అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవి పొరపొరలుగా ఉంటాయి. అన్నింటికన్నా పై పొర అన్నమయ కోశం. అన్నిటికన్నా లోపలి పొర ఆనందమయ కోశం. ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే లక్క పిడతల్లాగా ఉంటాయట.
వీటిలో నాలుగోది విజ్ఞానమయ కోశం. అంటే ఆత్మ. ఐదోది ఆనందమయ కోశం. అంటే పరమాత్మ. ఇందులో ముందు మూడు కోశాలు దేహం, మనస్సు, ప్రాణం అంటారు. అంటే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మ , పరమాత్మ వరుసలో ఉంటాయి. దీనికితోడు ఇంద్రియాలన్నింటినీ కలిగి వుండేదే దేహం. నాలుగో తొడుగు అయిన ఆత్మ మనం మెలకువగా ఉన్నపుడు దేహం, మనస్సుల వైపు అంటే విషయాల వైపు తిరిగి ఉంటుందట.
అదే గాఢ నిద్రలో ఉన్నపుడు దేహం, ఇంద్రియాలు, మనస్సు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ సమయంలో ఆత్మ పరమాత్మ వైపు అంటే విజ్ఞానమయ కోశం అయనందున ఆనందమయ కోశానికి అభిముఖం అవుతుంది. మన రెండు అరచేతులు కలిపి నమస్కరించినట్టన్నమాట. అదే ఆత్మ పరమాత్మను కలత లేని, నిలకడ గల గాఢ సుఘుప్తిలో చేరుకోవడం. అంటే ఆత్మ పరమాత్మలు గాఢ నిద్రలో కలుస్తాయన్నటమాట

గురువు - దేవుడు - ఆత్మ

గురువు - దేవుడు - ఆత్మ


"ఈశ్వరో గురురాత్మేతి"..అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.అంటే, దైవము, గురువు,ఆత్మా ఒక్కరే అని అర్ధం.


గురుపూర్ణిమ సందర్భంగా ఎవరెన్ని ఉపన్యాసాలు చెప్పినప్పటికీ అసలైన ఒక్క విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు.ఒకవేళ ఎవరైనా నాబోటివాడు చెప్పినా ఎవరూ పాటించడమూ లేదు.
 అదేంటంటే - మనుషులు గురువును పూజిస్తారు గాని గురుబోధను పాటించరు.అలాగే దేవుడిని పూజిస్తారు గాని దేవుడిని (చేరాలని) కోరుకోరు.
ఇదే మానవజాతి ఆడుతున్న అతి పెద్దనాటకం.ఈ నాటకాన్ని గమనించలేనంత తెలివితక్కువ వాళ్ళు కారు దేవుడూ గురువూ.


గురుబోధను పాటించాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి.దీనికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.


దైవాన్ని చేరుకోవాలంటే నువ్వే అదృశ్యం కావాలి.దీనికీ ఎవరూ సిద్ధంగా లేరు.


మరి మహాభక్తులుగా నటిస్తున్న ఈ లోకులందరూ ఏం చేస్తున్నారు?


"మేము నీ బోధను పాటించము.కానీ మేము కోరిన వరాలు మాకివ్వు. కష్టాల్లో మాకు అండగా ఉండు" - అని గురువు చుట్టూ చేరి గోల పెడుతున్నారు.


"నువ్వు మాకక్కర్లేదు.మేం చేసే పూజలు స్వీకరించి మేము కోరుకునే వరాలు మాత్రం మాకివ్వు" - అని దేవుడితో చెబుతున్నారు.


వెరసి దైవాన్నీ గురువునూ మానవులు అడ్డంగా తిరస్కరిస్తున్నారు.వాళ్ళ దగ్గర ఉన్న వరాలిచ్చే శక్తిని మాత్రం వీళ్ళు దోపిడీ చెయ్యాలని చూస్తున్నారు. అదికూడా పూజ అనే లంచం ఆశచూపించి.అంటే - లోకంలో ఆడే నాటకాలనే దైవం దగ్గర,గురువు దగ్గరా కూడా ఆడాలని వీళ్ళు చూస్తున్నారు. అంతేకాదు ఆడుతున్నారు కూడా.
 మనుషులకు నిజంగా కావలసింది దేవుడూ కాదు గురువూ కాదు.వాళ్లకు కావలసింది సెక్యూరిటీ మాత్రమే.ఒక మానసిక ఆసరా మాత్రమే వాళ్లకు కావాలి.వారు ఆడే రోజువారీ నాటకాలకు ఒక డివైన్ సపోర్టూ డివైన్ శాంక్టిటీ మాత్రమే వారికి కావాలి.మేము చేస్తున్నవి పాపాలు కావు,మేము చేస్తున్నవి తప్పులు కావు - అన్న భరోసా మాత్రమే వారికి కావాలి.ఒకవేళ అవి తప్పులూ పాపాలూ అయినా సరే వాటిని ఎల్లకాలమూ క్షమిస్తూ, 'నీ పద్ధతి మార్చుకో' అని చెప్పకుండా,వీళ్ళు పెడుతున్న బెల్లమూ మరమరాలూ కొబ్బరి ముక్కలూ తింటూ నోర్మూసుకుని పడుండే దేవుడే వీరికి కావాలి.
 "నువ్వు నడుస్తున్న దారి తప్పుదారి.అది సరియైన దారి కాదు.నువ్వు మారాలి." అని చెప్పే గురువునూ దేవుడినీ మనుషులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారు.
తమతమ స్వార్ధపూరిత అవసరాలకోసం,దేవుడిని పూజించినట్లు మనుషులు నటిస్తారు.గురువు చెప్పినది విన్నట్లు నటిస్తారు.కానీ ఈ రెండూ త్రికరణశుద్ధిగా మాత్రం ఎవ్వరూ చెయ్యరు.
 ఈ క్రమంలో గురువుకూ దైవానికీ నిజానికి దూరం అవడమే గాక, వారికి ప్రతిరూపం అయిన తన ఆత్మకు కూడా దూరమై పోతున్నారు.ఈ మూటికీ దూరమైన వానికి జీవితంలో శాంతి ఎలా ఉంటుంది? అందుకే నేడు ఎవరి జీవితాలు చూచినా శాంతి మాత్రం లేదు.మిగిలినవన్నీ ఉండవచ్చు.కానీ శాంతి మాత్రం లేదు.


దానికి అసలైన కారణం దైవానికీ, గురువుకూ,ఆత్మకూ దగ్గరౌతున్నామన్న భ్రమలో ఉంటూ ఇంకా ఇంకా దూరం కావడమే.


మానవులు ఈ మోసపూరితమైన తమ మనస్తత్వాన్ని పోగొట్టుకోనంత వరకూ వారికి శాంతి ఎప్పటికీ దొరకదు.


ఇది రేపటి సూర్యోదయమంత నిజం

Saturday, November 7, 2015

దశ దానాలు అంటే ఏమిటి?

దానం, ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ,వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునకు చేసిన దానఫలం.,పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమజన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది. ‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా., తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు.
శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం పది దానాలు.
                గో భూ తిల హిరణ్య ఆజ్య  వాసౌ ధాన్య గుడానిచ
                   రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః  
దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ ధానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా..
గోదానం
 గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావథిగి దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి. ఈ దానంతో   శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.
భూదానం
 కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై., దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
తిలదానం
 తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
హిరణ్య (సువర్ణ)దానం
హిరణ్యము అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
ఆజ్య(నెయ్యి)దానం
 ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.  
వస్త్రదానం
 శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.
ధాన్యదానం
 జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.
గుడ(బెల్లం)దానం
 రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు  సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.
రజత(వెండి)దానం
 అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ, కేశవులు., పితృదేవతలు సంప్రీతులై., దాతకు సర్వసంపదలను, వంశాభివృద్ధిని  అనుగ్రహిస్తారు.
లవణ(ఉప్పు)దానం
 రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై., దాతకు ఆయుర్దాయమును, బలాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.
ఇవి దశ దానాలు. ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలను భక్తి,శ్రద్ధలతో చేయాలిగాని, దానగ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు. అలా చేస్తే ఫలితం శూన్యం అనే నిజాన్ని గుర్తించి మరీ దానం చెయండి.

శివకేశవులకు భేదం లేదు...ఇద్దరు ఒక్కరే :

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః!!

శివ కేశవుల అభేదాన్ని ఈ శ్లోకం తెలుపుతున్నట్లే హరిహరుడు, రామలింగడు, రామేశ్వరుడు, శంకర నారాయణుడు అనే పేర్లు కూడా ఈ అభేదాన్ని చాటుతున్నాయి. ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏసమాసానికి చెందినది అనే సందేహం కలిగిందట. రామస్య ఈశ్వరః అని అంటే రామునికి ఈశ్వరుడు(ప్రభువు) అని అర్ధం వస్తుంది. అది శివాధిక్యం చెబుతుంది. శివుని విల్లు విరిచిన రాముడు శివుని కంటే ఏవిధంగా తక్కువ? విష్ణుమూర్తిని అడిగి సందేహ నివృత్తి చేసుకుందాం అనుకొని వైకుంఠం వెళ్ళారుట. దానికి సమధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తోంది రామస్య ఈశ్వరః అని అన్నారట.
ఆ విష్ణువు ఏదో వినయంతోనో, అహంభావం ఉండరాదు అనే ఉద్దేశ్యంతోనో, మొహమాటంతోనో ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలకు మాత్రం సందేహ నివృత్తి కాక కైలాసానికి బయలుదేరారు. దానికి శివుడు సమాధానంగా ఇందులో సందేహానికి ఏముంది? రాముడై ఈశ్వరుడుగా గలవాడు అన్నాడట. అప్పటికీ అర్థంకాక దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారుట. వీరి బాధ విన్న బ్రహ్మగారు ఇలా అన్నారు. "రామేశ్వరుడంటే రాముడొకడూ ఈశ్వరుడింకొకడూ కాదు రాముడే ఈశ్వరుడు, ఈశ్వరుడే రాముడు" అన్నారట.
విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః
ఉభయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్!!
శివకేశవులొకటే అని బ్రహ్మ బోధించాడట. పురాణాలలో ఒకచోట విష్ణువు జయించాడని, ఒకచోట శివుడు జయించాడని వింటూ ఉంటాం. అంతేకాక కొన్ని చోట్ల ఒకరినొకరు పూజించుకున్నారని వింటాం. పూర్వం బ్రహ్మగారు పంచముఖుడుగా ఉండేవాడు. ఆయనకు కొంచెం అహంభావం హెచ్చినందువల్ల ఈశ్వరునికి కోపం వచ్చి బ్రహ్మగారి ఒకతలను గిల్లి వేశాడట. ఆబ్రహ్మ కపాలం ఒకానొక శాపం ఈశ్వరుని చేతికే అంటుకుపోయిందిట. పైగా బ్రహ్మహత్యాపాతకం ఒకటి చుట్టుకొన్నదిట. అది పోగొట్టుకోవడానికి తిరుకుండియూరులోని పెరుమాళ్ళుని శివుడు పూజించాడని, అందలి మూర్తికి హరశపవిమోచకుడని పేరనీ స్థలపురాణం చెప్తుంది. పరతత్త్వం ఒకటే. తన మాయాశక్తి చేత ఆయా సమయాలలో ఒక్కో రూపంతో అనుగ్రహించడానికై ఆవిర్భవిస్తున్నది. ఏ అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటామో ఆ అనుగ్రహాన్ని ఇచ్చే మూర్తిని ఆరాధించాలి. అన్నీ ఒక్కటే అనే అభేద జ్ఞానం ఎన్నటికీ మరువరాదు. త్రిమూర్తులు త్రిగుణాత్మకంగా ఉన్నారు. జగత్తును కాపాడటమూ అనుగ్రహించడమూ సత్త్వగుణం. శ్రేయస్సు కావాలంటే సత్త్వ గుణ ప్రధానమైన విష్ణువును ఆరాధించాలి. శివుని రంగు తెలుపు. ఆయన ఉండేచోటు కైలాసం. అదీ తెలుపే. ఈ గుణాలు సత్త్వగుణాన్ని తెలియజేస్తాయి.ఈ మూర్తులలో ఆధిక్యానధిక్యములు ఏమాత్రమూ లేవు. హరిహరులిద్దరూ ఒక్కటే అది తెలియని వాని నోట్లో మన్ను అని తమిళంలో ఒక సామెత ఉంది. ఒకే తత్త్వం మాయచేత అనేక రూపాలతో గోచరిస్తుంది. పసిబిడ్డకు బొమ్మ మామిడిపండు ఇస్తే దానిని తినడానికి పూనుకుంటుంది. మనకు నవ్వు వస్తుంది. అలాగే ఎన్నో వికారాలకు లోనయిన ఈ ప్రపంచాన్ని సృష్టించి, కాంతా కనక క్షేత్రాదులను చూపిస్తూ మనలను మభ్యపెడుతూ ఆడిస్తున్నాడు. ఇదంతా భ్రాంతి. రజ్జుసర్ప భ్రాంతి. అలాగే వేదాంత శాస్త్ర పఠనం, శ్రవణం వల్ల ఇదంతా మిధ్య అనే ఎరుక కలుగుతుంది. అందువల్ల ఎక్కువ తక్కువలు కట్టిపెట్టి వంశానుక్రమముగా కొలిచే దేవతలను పరదేవతగా పూజించాలి. తక్కిన దేవతలను పరదేవతయొక్క వేరు వేరు అంశలుగా తెలుసుకొని అభేద అనుభవంతో అచంచలమయిన శాంతితో ఉండాలి. దానిని ఈశ్వరుని అనుగ్రహంతో అనుభవంలోకి తెచ్చుకోవాలి.