Thursday, April 30, 2020

శివ పంచాక్షరి స్తోత్రం మరియు అర్ధము



శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన

శివ పంచాక్షరి స్తోత్రం మరియు అర్ధము 


నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమః శివాయ || 1 ||
అర్దము :-
నాగేంద్రున్ని హారముగా ధరించినవాడు, మూడుకన్నులవాడు, భస్మము వంటినిండా పూసుకున్నవాడు, మహేశ్వరుడు, నిత్యమయినవాడు, పరిశుద్ధుడు, దిగంబరుడు, "నమశ్శివాయ" అను మంత్రము నందలి 'న' అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము  (1)

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై “మ” కారాయ నమః శివాయ || 2 ||
అర్దము :-
ఆకాశగంగాజలమనే చందనము పూయబడినవాడు, నందీశ్వరుడు మొదలైన ప్రమథ గణములకు నాయకుడు మందారము మొదలైన అనేక పుష్పములచే పూజింపబడిన వాడు,  "నమశ్శివాయ" అను మంత్రము నందలి   'మ ' అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము. (2)


శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ |
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై “శి” కారాయ నమః శివాయ || 3 ||
అర్దము :-
మంగళకరుడు, పార్వతీ ముఖమనే పద్మసముదాయమును వికసింపచేయు సూర్యుడు, దక్షుని యాగము నాశనము చేసినవాడు, నల్లని కంఠము కలవాడు, జండాపై ఎద్దు చిహ్నమున్నవాడు, "నమశ్శివాయ" అను మంత్రము నందలి   'శి' అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము. (3)

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ” కారాయ నమః శివాయ || 4 ||
అర్దము :-
వశిష్టుడు, అగస్త్యుడు, గౌతముడు, మొదలైన మునీంద్రులచేత పూజింపబడు జటాజూటము కలవాడు, చంద్రుడు - సూర్యుడు - అగ్ని మూడు కన్నులుగా కలవాడు, "నమశ్శివాయ" అను మంత్రము నందలి   'వ' అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము. (4)


యఙ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై “య” కారాయ నమః శివాయ || 5 ||
అర్దము :-
యక్షస్వరూపుడు, జటలను ధరించినవాడు, " పినాకము " అను ధనస్సును చేతిలో పట్టుకున్నవాడు, సనాతనుడు, ఆకాశమునందుండు దేవుడు, దిగంబరుడు,  "నమశ్శివాయ" అను మంత్రము నందలి   'య' అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము.


శివ పంచాక్షరి స్తోత్రము యొక్క అర్ధమును YouTube లో Raghava Reddy Videos నుండి స్తోత్రము telugu one bhakthi Web site నుండి తీసుకోవడం జరిగింది. 

శివ అపరాధ క్షమాపణ స్తోత్రం అర్ధము


శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన

శివ అపరాధ క్షమాపణ స్తోత్రం

 అర్దము :-

ఓ శివా! తల్లి గర్భమునందున్న నన్ను పూర్వజన్మలో చేసిన పాపకర్మ చుట్టుకొనుచున్నది. అపవిత్రములైన మల, మూత్రముల మధ్యనున్న నన్ను తల్లి కడుపులో ఉన్న జఠరాగ్ని ఉడకబెట్టుచున్నది. గర్భము నందు ఉన్నపుడు ఏఏ దుఃఖము పీడించునో దానిని వర్ణించుట ఎవడి తరము? శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (1)




పసితనము నందు మిక్కిలి దుఃఖముననుభవించి , మలములో దొర్లుచూ పాలుత్రాగదలచి ఇంద్రియములను కదిలించుటకు కూడా శక్తిలేని వాడనైతిని, మలమునందు పుట్టు పురుగులు నన్ను పీడించుచున్నవి. నానా రోగములచే దుఃఖితుడనై పరాధీనుడనై శంకరుని స్మరించలేకుంటిని. శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (2)




నేను యువకుడనైనంతనే సుఖములను ఆశించు పంచేంద్రియములనే సర్పములచే మర్మస్థానము నందు కరువబడితిని. మంచి చెడులు తెలుసుకొను వివక్షణా జ్ఞానము నశించినది. పుత్ర, ధన, యువతి సుఖమునను భవించుటలో  మునిగితిని. అభిమానము నిండి గర్వించిన నా హృదయము శివధ్యానము విడిచినది.  శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (3)



ముసలితనము నందు ఇంద్రియములు పనిచేయక తాపత్రయముచే సంప్రాప్తించిన రోగములతోనూ , బంధుజన వియోగములతోనూ, నా శరీరము కృశించిపోయినది. మనస్సు జ్ఞాపక శక్తిని కోల్పోయి దీనమై అసత్యములైన ఆశలతో భ్రమించుచూ పరమేశ్వరుని ధ్యానించుటలేదు.  శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.   (4)



ఓ శివా ! ప్రాతఃకాలమునందే స్నానము చేసి నీ అభిషేకము కోసమై నేనెన్నడూ గంగాజలము తీసుకురాలేదు. నిన్ను పూజించుటకై దట్టమైన అడవికి పోయి ముక్కలు గాని మారేడు దళమును ఎప్పుడూ తేలేదు. నిన్ను అలంకరించుటకై సరస్సునందు వికసించి, పరిమళములు వెదజల్లుతున్న పద్మములమాల తీసుకురాలేదు,  శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.   (5)



ఓ శివా ! పాలతో , తేనెతో, నేతితో , పెరుగుతో బెల్లముతో నీ లింగమును నేను అభిషేకించలేదు. చందనము మొదలైన సుగంధ ద్రవ్యములు పూయలేదు. బంగారు పూలతో పూజించలేదు, ధూపములతో, కర్పూరముతో, దీపములతో, నిన్ను అర్చించలేదు. వివిధములైన రుచులుకల పిండి వంటలతో నీకు నైవేద్యం పెట్టలేదు.  శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (6)



ఓ శివా ! ప్రతిపదము అర్దముకానిదీ, ప్రాయశ్చిత్తముతో నిండినదీ, అగు కర్మమార్గమునందు స్మార్తపూజ కర్మను ఆచరించుట నాకు శక్యం కాదు. బ్రహ్మ మార్గముననుసరించు వారిచే చేయదగిన శ్రౌతకర్మ నాకెట్లు సాధ్యమగును ? శ్రవణ మననములు తెలుసుకొని నిదిధ్యాస మెట్లు కలుగును? శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.  (7)



ఓ శివా ! "శివ " అను నామమును ధ్యానించి మిక్కిలిగా దానము చేయలేదు. లక్షల కొలది బీజమంత్రములతో హోమము చేయలేదు. వ్రతములతో, జపముతో, నియమముతో, గంగాతీరము నందు తపస్సు చేయలేదు. జపించవలసిన శివ మంత్రములను జపించలేదు.  శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము.  (8)



ఓ శివా ! నగ్నమైనవాడు, సంసార బంధములు తొలగినవాడవు, సత్వరజస్తమో గుణములు లేనివాడు, అజ్ఞానాంధకారము నశించినవాడు. ముక్కు చివరి దృష్టిని కేంద్రీకరించి తపస్సు చేయువాడు, సంసార మందలి గుణముల నెరిగినవాడు నా  కెప్పుడు కనబడలేదు. ఉన్మాదావస్థలో మతి చెలించినవాడనై నిన్ను స్మరించలేదు.
  శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (9)



ఓ శివా ! సహస్రారపద్మము నందు నిలచి ప్రణవమయమైన వాయువుచే కుంభితమైన సూక్ష్మమార్గమునందు ప్రశాంతమగు మనస్సును విలీనము చేసినచో శివుడను పేరుకల నీ దివ్యరూపము యొక్క వైభవము తెలియును. లింగమునందు, వేదవాక్యమునందు సకల జీవరాసుల యందు నిండి ఉన్న శంకరుని నేను స్మరించలేదు.   శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (10)



ఓ శివా ! మనోహరుడవు, వేదాంతముచే తెలియబడువాడవు, హృదయపద్మము నందు వెలుగొందుచున్నవాడవు, ప్రకాశవంతుడవు, సత్యము, శాంతము, అగు స్వరూపము కలవాడు, సకల మునుల హృదయ పద్మములందున్న వాడవు, సత్వరజోస్తమో గుణములు లేనివాడవు, అగు నిన్ను మేలుకువ యందు కానీ గాఢనిద్ర యందు కాని ఎన్నడూ స్మరించలేదు.  శ్రీ మహాదేవా ! శంభో ! నా అపరాధమును క్షమించుము. (11)



చంద్రుడు తలపై ప్రకాశంచుచున్న వాడు, మన్మధుని సంహరించినవాడు, గంగను ధరించినవాడు, శుభము చేయువాడు, మెడలోను చెవులయందు సర్పాభరణములను ధరించినవాడు, కంటియందు మండుచున్న అగ్ని కలవాడు, ఏనుగు చర్మము చుట్టుకున్నవాడు, మూడు లోకములకు సారమైనవాడు అగు శివుని యందు ఓ చిత్తమా ! మోక్షము కొరకై నిష్కల్మషముగా ప్రవర్తించుము, వేరు కర్మలతో ఏమి ప్రయోజనము? (12)



వాహనములతో, ధనముతో, గుర్రములతో, ఏనుగులతో, అధికారముతో, పుత్రులతో, భార్యతో, మిత్రులతో, పశువులతో, శరీరముతో, ఇంటితో ఏమి ప్రయోజనము? 
ఇదంతా క్షణములో నశించుపోపునని తెలుసుకోని ఓ మనసా ! వీటిని దూరముగా వదిలిపెట్టుము. ఆత్మలాభము కొరకై గురు ఉపదేశము ద్వారా శ్రీ పార్వతీవల్లభుని సేవించుము. (13)



పౌరోహిత్యము, రాత్రిసంచారము, గ్రామాధికారిగా ఉండుట, నౌకరిచేయుట, మఠాధిపతిగా వ్యవహరించుట, అబద్ధములాడుట, సాక్ష్యముపలుకుట, పరాన్నము భుజించుట, వేదములను ద్వేషించుట, దుష్టులతో సహవాసము, ప్రాణుల పట్ల దయలేకుండుట అనునవి ఓ పశుపతీ ! నాకు జన్మాంతరములందు కలుగకుండు గాక! (14)



చూచుచుండగానే ఆయువు నశించుచున్నది. ప్రతిదినమూ యవ్వనము క్షీణించుచున్నది. గడిచిన రోజులు మరలా తిరిగిరావు. కాలము లోకమును భక్షించుచున్నది. నీటి అలలవలే లక్ష్మీ (సంపద) చంచలమైనది. మెరుపు వలే జీవితము చంచలమైనది. కనుక శరణాగతుడనైన నన్ను కరుణతో నీవే ఇప్పుడు రక్షించుము. (15)

             
శివ అపరాధ క్షమాపణ స్తోత్రము అర్ధము ను YouTube లో Raghava Reddy Videos నుండి తీసుకోవడం జరిగింది.


కాలభైరవాష్టకం స్తోత్రము మరియు అర్ధము





శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన

కాలభైరవాష్టకం స్తోత్రము మరియు అర్ధము

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం l
వ్యాళయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరమ్ ll
నారదాది యోగిబృంద వందితం దిగంబరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll 1 ||
అర్దం:-
ఇంద్రుడు పూజించు పాదపద్మములు కలవాడు, పామును యజ్ఞోపవీతముగా దాల్చినవాడు, తలపై చంద్రుణ్ని అలంకరించుకున్నవాడు, దయ చూపించువాడు, నారదుడు మొదలైన యోగులచే నమస్కరింపబడువాడు, దిగంబరుడు, కాశీనగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను. (1)


భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం l
నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ ll
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll 2 ||
అర్దం:-
కోటి సూర్యులవలే ప్రజ్వలించువాడు, సంసారసముద్రమును దాటించువాడు, ఉత్తముడు, నీలకంఠుడు, కోరికలు తీర్చువాడు, మూడు కన్నులవాడు, యమునికే యముడైన వాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, నాశములేనివాడు, స్థిరమైనవాడు, కాశీనగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను. (2)


శూలటంక పాశదండ పాణిమాది కారణంl
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ ll
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll 3 ||
అర్దం:-
శూలము - టంకము - పాశము - దండము అను ఆయుధములను చేతులతో ధరించినవాడు, అన్నిటికీ ఆదికారణమైనవాడు, నల్లని శరీరము కలవాడు, ఆదిదేవుడు, నాశము లేనివాడు, దోషములంటనివాడు, భయంకరమైన పరాక్రమముకలవాడు, సమర్థుడు, విచిత్రమైన తాండవమును ఇష్టపడువాడు, కాశీనగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను.(3)


భుక్తిముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం l
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ ll
నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీ లసత్కటిం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll 4 ||
అర్దం:-
భుక్తి - ముక్తులనిచ్చువాడు, ప్రశస్తమైన సుందర శరీరము కలవాడు, భక్తవత్సలుడు, స్థిరమైనవాడు సమస్త ప్రపంచమును నిగ్ర హించువాడు, నడుము నందు మోగుచున్న అందమైన బంగారు చిరుగంటలు ధరించినవాడు, కాశీనగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను.(4)


ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం l
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ ll
స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగనిర్మలం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll 5 ||
అర్దం:-
ధర్మమును రక్షించువాడు, అధర్మమును నాశనం చేయువాడు, కర్మ పాశములను విడిపించువాడు, సుఖమునిచ్చువాడు, అంతటా వ్యాపించినవాడు, బంగారు వన్నెకలకేశ పాశములతో శోభిల్లు నిర్మల శరీరుడు, కాశీనగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను.(5)


రత్నపాదుకాప్రభాభిరామ పాదయుగ్మకం l
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ ll
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభూషణం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll 6 ||
అర్దం:-
అందమైన పాదములందు రత్న పాదుకలను ధరించినవాడు, నిత్యుడు, అద్వితీయుడు, ఇష్టదైవము, నిరంజనుడు, యముని అహంకారమును నాశనం చేసినవాడు, భయంకరమైన కోరలు ఆభరణములుగా కలవాడు, కాశీనగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను.(6)


అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం l
దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్ ll
అష్టశిద్ధిదాయకం కపాలమాలికాధరం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll 7 ||
అర్దం:-
అట్టహాసముతో బ్రహ్మాండములను బద్దలు చేయువాడు, చూపుతో పాపములను తొలగించువాడు, ఉగ్రముగా శాసించువాడు, అష్టసిద్ధులను ప్రసాదించువాడు, కపాలమాల ధరించినవాడు, కాశీనగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను.(7)


భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం l
కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్ ll
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం l
కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ll 8 ||
అర్దం:-
భూతనాయకుడు, విశాలమైన కీర్తి కలిగించువాడు, కాశీలో నివశించు వారి పుణ్యపాపములను శోధించువాడు, సర్వవ్యాపి నీతిమార్గపండితుడు, పురాతనుడు, ప్రపంచ రక్షకుడు, కాశీనగరమునకు అధిపతియైన కాలభైరవుని సేవించుచున్నాను.(8)


కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం l
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్ ll
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం l
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ll
అర్దం:-
మనోహరమైనది, జ్ఞానమును, ముక్తిని కలిగించునది, అనేక పుణ్యములను పెంపొందించునది, శోకము- మోహము - దీనత్వం - కోపం - పాపములను - నశింపచేయునది అగు కాలభైరవాష్టకం పాటించు వారు నిశ్చయముగా కాలభైరవపాదసన్నిధిని చేరెదరు.


కాలభైరవాష్టకం అర్దం YouTube లో raghava reddy videos నుండి తీసుకోవడం జరిగింది.


Chandu bharadwaj 

Wednesday, November 11, 2015

స్వార్దం ఎప్పుడుండాలి


 మనిషికి స్వార్ధం ఉండాలి
 ఆ స్వార్ధం ఎప్పుడుఉపయోగపడాలో తెలుసా.?
ఇది నా దేశం
 ఇది నా ధర్మం
 అని ఇలాంటి సమయంలో
 నా అనే స్వార్ధం ఉండాలి
 ఎదుటివారు మన ధర్మాన్ని కించ పరుస్తున్నా
 చూసి ఏమీ అనని వాడు
 బ్రతికి ఉన్న చచ్చిన శవమే.!
ఇలా ఎంతోమంది చచ్చిన శవాలున్నారు
 ఈ దేశంలో
 స్వామీ వివేకనంద ఇచ్చిన స్పూర్తి చచ్చిపోయింది
 జనాలలో
 లేండి
 మేల్కోనండి
 గమ్యం చేరేవరకు
 విశ్రమించకండి
 అని ఆయన చెప్పిన మాటలు
 ఎవరి చెవులుకు తాకడం లేదు
 మనమంతా స్వార్దపూరితంగా
 నా అనే అహంకారంతో
 మన ధర్మాన్ని, ఈ దేశాన్ని
 ఇలా ఐనా కాపాడుకుందాం.!

ఆత్మజ్ఞానం

ఆత్మను గురించి ఏం ఆలోచించగలం? ఏం చెప్పగలం? ఆలోచన మనస్సు పరిధిలోది. 'ఆత్మ' మనస్సు దాటిన తర్వాత కలిగే అనుభూతి. ఆత్మ ఉండీ లేనట్లు, లేకపోయినా ఉన్నట్లు అనిపిస్తుంది. అనుభూతికి మాత్రం అందుతుంది. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేవి మూడూ ఒక్కటే. రూపగుణాలు ఒక్కటే. అవధులు మాత్రం వేర్వేరు. ఒక్కటే అయిన ఆత్మ అవసరానికి 'అంతరాత్మ' అనిపిస్తుంది. పైకి వెళ్లాక 'పరమాత్మ'గా వ్యవహరిస్తుంది. ఆ రహస్యం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. అసలు ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మను గురించి మరింతగా తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఇక్కడ తెలుసుకునేది మనస్సుతో కాదు. అత్మతో - అది ప్రజ్ఞా విశేషం.
అయితే 'ఆత్మ' వివేకం ముందు కలగాలి. వివేకానికి జిజ్ఞాస జతపడాలి. అప్పుడు ప్రజ్ఞ బయటకొచ్చి ఆత్మజ్ఞానానికి తుదిమెరుగులు దిద్దుతుంది. 'ఆత్మ'ను గురించిన కనీస అవగాహన ఏర్పడితే అటువైపు దృష్టి సారించవచ్చు. మామూలు దృష్టికి ఆత్మ కనిపించదు, అందుకు అంతర్దృష్టి ఏర్పడాలి. మనస్సును నిద్రపుచ్చి లేదా శూన్యంచేసి ఆలోచనలు తలఎత్తకుండా చేసినప్పుడు ఆత్మ అనుభూతికి అందుతుంది. నిజానికి ఆత్మసహకారం లేనిది 'ఆత్మజ్ఞానం' కలగదు.

ఆత్మ రక్షణ, పోషణకు పరమాత్మ చింతనే మార్గం

జీవితంలో సుఖభోగాలు అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. సాధారణంగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. మానవ జీవితం కష్టసుఖాల సంగమం. ఆపదల్లో ఉన్నప్పుడు కూడ ఈశ్వర చింతన కలిగి ఉండనివారున్నారీ లోకంలో. అట్టివారు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి వారిని నాస్తికులనడమే సమంజసం. వీరు ఎంత కష్టమొచ్చినా ఒక్క క్షణమైనా భగవన్నామోచ్ఛరణ చేయరు. ‘‘జాతస్య మరణం ధృవమ్’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతి జీవిని మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. అంచేత మొండికట్టెల్లా కాలాన్ని వ్యర్థంగా గడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఉత్కృష్టమైన మాన
వజన్మ ఎత్తికూడ అనివార్యమైన భగవత్ప్రేమకు పాత్రులు కాకపోవడం చింతించవలసిన విషయం. అభ్యాసం ఉంటే తప్ప ఎవరికి పరమాత్మ చింతన అలవడదు. ఉన్నతమైన మానవజన్మనెత్తి బుద్ధి జ్ఞానం కలిగి ఉన్న మనిషి కాలాన్ని వ్యర్థంచేసే బదులు ఏ క్రిమికీటకంగానో పుట్టి ఉంటే ఈ మానుషజన్మకు కళంకం ఉండదు కదా!
సర్వకాల సర్వావస్థలయందు సంసార సుఖభోగాల్లో పడినవారికి ఎంత ఆయుష్షుంటే ఏం లాభం? తనకు తెలీకుండానే అది హారతికర్పూరంలా కరిగిపోతుంది. కాలం వృధాగా పోతోందని గ్రహించిన వాడికి క్షణకాలమైనా చాలు మోక్షంకోసం ప్రయత్నించి సిద్ధిపొందొచ్చు. మనం చేసే మంచి పనుల్లోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి పది మందికి పనికొచ్చే సత్కార్యాల్ని చేయాలి. ఈశ్వరోపాసనకి పూజ, ప్రార్థన ముఖ్య సాధనాలు. మన స్థూల శరీరానికి కర చరణాదులు ఎలాగో అలాగే ఆత్మకు జ్ఞానాదులు అలాంటివని తెలుసుకోవాలి. లోకంలో జనులు దేహం మీదున్న అభిమానం చేత సర్వసుఖాల్ని పొందడంకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖంకోసం గాని, సంసార బంధ విముక్తులవడానికి గాని యత్నించరు. అందువల్లే ఉత్కృష్టమైన ఈ మానవజన్మ వ్యర్థవౌతోంది. ఆత్మను పోషించుటకు, రక్షించుటకు పరమాత్మ చింతనే ముఖ్యసాధనం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాగే భగవంతుణ్ణి తలంచని వాడికి ఆ దేవుడు కరుణించడు. ముక్తినివ్వడు. పండితులు, భాగవతులు తమ గానం చేత, నృత్యం చేత, పూజాది సత్కర్మలచేత జపతపముల చేత భగవంతుణ్ణి అనేక రకాలుగా స్తుతిస్తారు. మరి పామరుల సంగతేంటి? రాజదర్శనం కావాలంటే ముందుగా భటుని దర్శించవలసి ఉంటుంది. తోటలోని ఫలాలు కావాలనుకుంటే ముందుగా తోటమాలిని ఆశ్రయించాలి. అలాగే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు భాగవతుల్ని ఆశ్రయించాలి. అది సాధ్యంకానప్పుడు సత్పురుష సాంగత్యమైనా చెయ్యాలి. అది కూడ దుర్లభం అనుకుంటే తన దుష్టప్రవర్తనను తానే సరిదిద్దుకోగలగాలి. అందుకు శుభాశుభములు తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. వివేకం కలగాలంటే ముందు తను నీతిగా ఉండాలి. అందుకు విద్య అవసరం. విద్య అంటే ఆ సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవడమే. తప్ప పొట్టకూటికోసం విద్యలుకావని గ్రహించాలి. ఈశ్వర చింతన యందు అభిలాష ఉంటే విజ్ఞానవంతులవుతారు. దాంతో సంసార భోగవాంఛలు వాటంతటవే నశిస్తాయి. మనమంతా పుణ్యంకోసం గంగానది స్నానాలు, గుళ్ళు గోపురాల దర్శనం చేస్తుంటాం. ఇవన్నీ బాహ్యేంద్రియ శుద్ధి చేసేవే గాని ఆత్మశుద్ధికి తోడ్పడవు. వాటన్నిటికంటె ముందు శుభకర్మల్ని ఆచరించాలి. పరోపకారం, సత్యం పలకడం, భూత దయ, సత్‌సాంగత్య విద్య దానాదిక ధర్మాలు, మాతృపితసేవ, బ్రహ్మచర్యం, ఈశ్వర స్తుతి మున్నగు ఉత్తమగుణాలే శుభకర్మలు అనబడతాయి. శ్రీహరిని పూజించనివారు జీవచ్ఛవంబులనే చెప్పాలి. అందుకే అంటారు పరమాత్మ చింతన లేని జన్మవ్యర్థం అని.

ధర్మ సందేహం: ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?

ధర్మ సందేహం: ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?
నిద్రపోతున్నపుడు మన ఆత్మ పరమాత్మతో కలుస్తుందని మన వేదాంత శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కానీ, నిజంగానే ఈ రెండు ఒక్కటిగా కలుస్తాయా అనే ధర్మ సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. నిజంగానే ఈ రెండు కలుస్తాయట. ఇదెలాగంటారా... అయితే ఈ కథనం చదవండి.
సాధారణంగా మన శరీరాల్లో ఐదు కోశాలుంటాయని వేదాంత శాస్త్రం చెపుతోంది. అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవి పొరపొరలుగా ఉంటాయి. అన్నింటికన్నా పై పొర అన్నమయ కోశం. అన్నిటికన్నా లోపలి పొర ఆనందమయ కోశం. ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే లక్క పిడతల్లాగా ఉంటాయట.
వీటిలో నాలుగోది విజ్ఞానమయ కోశం. అంటే ఆత్మ. ఐదోది ఆనందమయ కోశం. అంటే పరమాత్మ. ఇందులో ముందు మూడు కోశాలు దేహం, మనస్సు, ప్రాణం అంటారు. అంటే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మ , పరమాత్మ వరుసలో ఉంటాయి. దీనికితోడు ఇంద్రియాలన్నింటినీ కలిగి వుండేదే దేహం. నాలుగో తొడుగు అయిన ఆత్మ మనం మెలకువగా ఉన్నపుడు దేహం, మనస్సుల వైపు అంటే విషయాల వైపు తిరిగి ఉంటుందట.
అదే గాఢ నిద్రలో ఉన్నపుడు దేహం, ఇంద్రియాలు, మనస్సు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ సమయంలో ఆత్మ పరమాత్మ వైపు అంటే విజ్ఞానమయ కోశం అయనందున ఆనందమయ కోశానికి అభిముఖం అవుతుంది. మన రెండు అరచేతులు కలిపి నమస్కరించినట్టన్నమాట. అదే ఆత్మ పరమాత్మను కలత లేని, నిలకడ గల గాఢ సుఘుప్తిలో చేరుకోవడం. అంటే ఆత్మ పరమాత్మలు గాఢ నిద్రలో కలుస్తాయన్నటమాట